నిజాంబాద్ జూలై 26(ప్రభన్యూస్): జుక్కల్ ఎమ్మెల్యే బాల్య స్నేహితుడు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోవడం పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ సిండే కన్నీటి పర్యంతమయ్యారు. జుక్కల్ జుక్కల్ మండలం కంఠాలి గ్రామానికి చెందిన కాంబ్లె గణపతి ఎక్సైజ్ శాఖలో సలాబత్పూర్ వద్ద హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయనకు గుండెనొప్పి రావడంతో బంధువులు, గ్రామస్థులు ఆయనను హుటాహుటీనా మహారాష్ట్రలోని దెగ్లూర్ పట్టణానికి చికిత్స నిమిత్తం తరలించినప్పటికి లాభం లేకుండా పోయింది.
అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైధ్యులు నిర్దారించారు. గణపతి అంత్యక్రియలు జుక్కల్ మండలంలోని కంఠాలి గ్రామంలో బుధవారం జరిగాయి. గణపతి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండేకు బాల్యమిత్రుడు. విపత్కర పరీస్థితుల్లో మంచి చెడుల్లో సైతం వీరు ఆప్యాయంగా పలకరించుకుని ఒకరినొకరు ధైర్యం చెప్పుకునే వారు హఠాత్తుగా గుండెపోటుతో మృతిచెందడంతో జుక్కల్ ఎమ్మెల్యే షిండే తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న షిండే శవపేటిక వద్ద బోరున రోదించారు. బాల్యమిత్రున్ని కోల్పోయానని తీవ్ర ఆవేదన వ్యక్తపర్చడమే కాకుండా గణపతి తల్లి, భార్య, పిల్లలకు ధైర్యాన్నిచ్చారు.
ఈ అంత్యక్రియల్లో పీఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కుషాల్ పటేల్ , ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులతో పాటు జుక్కల్ మండలంలోని అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు వందలాదిగా పాల్గొన్నారు. దీంతో కంఠాలిలో విషాదఛాయలు నెలకొన్నాయి.