Tuesday, November 26, 2024

ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి బర్త్​డే ఫ్లెక్సీలకు నిప్పు.. మహేందర్​రెడ్డి వర్గీయుల పనే అని కార్యకర్తల దాడులు

వికారాబాద్ జిల్లా తాండూరు టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. అయితే వీటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు . ఇది ఎమ్మెల్సీ మహేందర్​రెడ్డి వర్గీయుల పనేనన్న అనుమానంతో వారి ఇళ్లపై రోహిత్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఈ వ్యవహారంపై ఇరు వర్గాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్​రెడ్డి భేటీ అయ్యారు. తాండూరులో జరుగుతున్న పరిణామాలపై వివరించారు. ఏప్రిల్ 23న తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కూర్చొన్నా కూడా సీఐ రాజేందర్ రెడ్డి వారించలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి బూతులు తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఆడియో ఆధారంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక. ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఐని దూషించినట్టుగా చెబుతున్న ఆడియో తనది కాదన్నారు. ఈ విషయమై తాను చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.. తనకు పోలీసులు అంటే గౌరవమని చెప్పారు. ఈ వ్యవహరం వెనుక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హస్తం ఉందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఇద్దరిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిపించి మాట్లాడారు. అయితే.. కొంతకాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత లేకుండా పోతోందన్నది వాస్తవం. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే కొనసాగుతోందని చెప్పవచ్చు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవరగంలో, పార్టీపై తమ పట్టును నిలుపుకొనేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement