Tuesday, November 26, 2024

Tribal Reservations: కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడును భర్తరఫ్ చేయాలి

ఎస్టీల రిజర్వేషన్ పెంచాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. పచ్చి అబద్దాలు ఆడుతూ తప్పుడు ప్రకటనలు చేసిన కేంద్ర మంత్రి “బిశ్వేశ్వర్ తుడు” ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న గిరిజన నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. సంక్షేమ పథకాల అమలు, నిధులు పెంచడంలో కూడా నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. గతంలో గిరిజనులకు ఆరు శాతం రిజర్వేషన్ ఉందని, కానీ ఇప్పుడు గిరిజన జనాభా పెరిగిందన్నారు. జనాభా పెరిగిన దాని ప్రకారం రిజర్వేషన్ శాతం పెంచాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో తీర్మానం పెట్టి అనుమతి కోసం కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు.  కానీ మాకు ఎలాంటి బిల్లు రాలేదు అని బొంకుతూ కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు క్షమాపణ చెప్పాలని, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడును తక్షణమే భర్తరఫ్ చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నల్లబెల్లి మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ భాద్యులు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement