– కుత్బుల్లాపూర్, ప్రభన్యూస్
చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రగతి నివేదన యాత్ర చేపట్టారు. 100 రోజుల ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్, గాజుల రామారం జంట సర్కిళ్లు, నిజాంపేట్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలలోని ఆయ ప్రాంతాల్లో యాత్ర సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో 6000 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్టు ఎమ్మెల్యే వివేకా తెలిపారు.
100వ రోజు ప్రగతి యాత్రలో..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 వ వార్డు బాచుపల్లిలో 100 వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా శనివారం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణ రావు, స్థానిక కార్పొరేటర్ కొలను వీరేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. నిర్విరామంగా 99 రోజులు పూర్తి చేసుకొని వందో రోజుకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజాప్రతినిధులు, సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.
ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ హోమ్స్ కాలనీ, SJB హోమ్స్ కాలనీ, నందనవనం కాలనీ, రేణుక ఎల్లమ్మ కాలనీ, సాయి అనురాగ్ కాలనీలలో పాదయాత్ర చేశారు. రూ. 2. 37 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు -సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతోనే అభివృద్ధి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో 6000 వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. 100 రోజుల ప్రగతి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. యాత్ర మొదలు పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలలో పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాలనీలో మిగిలిన ఉన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ఒక ప్రణాళిక రూపొందిచి ముందుకు సాగుతున్నాం.