Friday, November 22, 2024

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్న ఎమ్మెల్యే కేపీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33 డివిజన్ల‌లో కౌన్సిల్ ఆమోదించిన మున్సిపల్ నిధులు రూ.118 కోట్లతో చేపడుతున్న 698 అభివృద్ధి పనుల పురోగతిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రగతి నగర్ లోని మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్&బి, ఎలక్ట్రికల్, ఎస్.ఎన్.డి.పి, హెచ్.ఎం.డబ్లూ.ఎస్.ఎస్.బి, లా అండ్ ఆర్డర్, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రూ.118 కోట్లతో చేపడుతున్న 698 వివిధ మౌలిక వసతులకు గాను రూ.43.41 కోట్లతో 318 పనులు ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు ఎమ్మెల్యే కు తెలిపారు. అదేవిధంగా రూ.20.88 కోట్లతో 96 పనులు జరుగుతున్నాయన్నారు. రూ.39.54 కోట్లతో 209 పనులు ప్రారంభించనున్నట్లు, ఈ పనులకు సంబంధించి 75 టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. అనంతరం 33 డివిజన్ల‌లో చేపడుతున్న ఆయా అభివృద్ధి పనులు, సమస్యలను ఒక్కో కార్పొరేటర్ ను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.118 కోట్లతో చేపడుతున్న మంచినీటి పైపు లైన్లు, రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, కరెంటు స్థంబాలు, విద్యుత్ ద్వీపాలు, పార్కుల అభివృద్ధి, మెయింటెనెన్స్, లింకు రోడ్లు, వర్షపు నీటి నాలాలు, కమిటీ హాల్లు వంటి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నాలాల అభివృద్ధికి ఎస్.ఎన్.డి.పి.కింద మంజూరైన రూ.84.63 కోట్లతో పనులు వేగంగా ప్రారంభించి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో గతంతో పోల్చితే అనేక సమస్యలను ఒక్కొకటిగా అధిగమించి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, గౌరవ పురపాలక మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఎన్ని నిధులైనా వెచ్చించి అన్ని డివిజన్ల‌ను అభివృద్ధి పరుస్తామన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నిజాంపేట్ ను ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement