- తులం బంగారం ఏమైంది
- రైతులకు సాగునీరు ఇవ్వకుంటే గేట్లు ఎత్తుతా
హుజురాబాద్, ఆంధ్రప్రభ : హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని 106 పంచాయతీల్లో ఏ ఒక్క గ్రామంలోనైనా వందశాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో రుణమాఫీ ఏ ఒక్క గ్రామంలో కూడా పూర్తిగా జరగలేదని, 70శాతం మాత్రమే జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చెప్పారన్నారు. రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంబిస్తుందన్నారు. రుణమాఫీ మాదిరిగానే రైతు భరోసా కూడా కొద్ది మంది రైతులకే పరిమితం చేసే విధంగా ప్రభుత్వం రోజుకో మాట చెబుతోందన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా అన్ని పంటలకు, ప్రతి రైతుకు భరోసా ఇవ్వాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధులో రూ.22వేల కోట్లు వృధా అయ్యాయని పేర్కొనడం విచిత్రంగా ఉందన్నారు. ప్రతి గ్రామంలో విచారణ చేపట్టి ఎక్కడ వృధా అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24గంటల విద్యుత్, వేసవికాలంలో కూడా మత్తళ్ళు దూకే విదంగా సాగునీటి సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, శ్రీరాంసాగర్ నీటిని ఖమ్మం వరకు తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని రైతులకు సాగునీటిని ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలన్నారు.
రెండు రోజుల్లో నీటిని రైతులకు విడుదల చేయకపోతే గేట్లను రైతులతో వచ్చి తానే విప్పుతానన్నారు. కాల్వల ప్రాజెక్టు కట్టను పునరుద్ధరణ చేయాలని తాను అసెంబ్లీలో మాట్లాడినా ఇప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. రూ.70కోట్లు విడుదల చేసి కాల్వల ప్రాజెక్టును కాపాడాలన్నారు.
నా పోరాటం పోలీస్ ల మీద కాదు…
నేను పోరాటం చేసేది ప్రభుత్వంపైన.. పోలీసులపై కాదని, ప్రభుత్వ నియంత్ర ధోరణిపై అని అన్నారు. తనపై ఇప్పటికి 30కేసులు నమోదు చేశారని, అయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపేదిలేదన్నారు. ఆరు గ్యారంటీలు, 420హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు.
దళిత బంధు రెండో విడత విడుదల చెయ్యాలి…
కేసీఆర్ ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో గతంలో ఇచ్చిన రెండో విడత దళిత బంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందని, అకౌంట్లలో ఉన్న డబ్భులు గత ప్రభుత్వం విడుదల చేస్తే ఈ ప్రభుత్వం నిలిపివేసి ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వెంటనే దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.