Monday, November 18, 2024

TS: ఎమ్మెల్యే గూడెంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఉమ్మడి మెదక్ బ్యూరో : 2014లో పటాన్చెరువు నియోజకవర్గంలోని ఓ కంపెనీపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దాడిచేసిన విషయమై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ విషయమై గతంలో సంగారెడ్డి న్యాయస్థానం మహిపాల్ రెడ్డిని దోషిగా నిర్ధారించి రెండున్నర సంవత్సరాల జైలుశిక్ష, 2500 రూపాయల జరిమానా విధించింది. దీనిపై స్టే కోరుతూ ఎమ్మెల్యే గూడెం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హై కోర్టు స్టే ఇవ్వడంతో పటాన్చెరువు కు చెందిన న్యాయవాది ముఖీమ్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కాగా పరిశ్రమపై దాడి విషయమై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం పటాన్చెరువు ఎమ్మెల్యే టికెట్ మహిపాల్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు తనకు సైతం టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని విన్నవించుకున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని, కనీసం నాలుగు స్థానాలు కేటాయించాలని, ముఖ్యంగా పటాన్చెరువు ఎమ్మెల్యే టికెట్ సమర్ధుడైన, సేవా భావం కలిగిన నీలం మదుకు కేటాయించాలని డిప్యూటీ స్పీకర్, ముదిరాజ్ కులస్తుల రాష్ట్ర అధ్యక్షులు బండారి ప్రకాష్, మంత్రి హరీష్ రావు ను కలిసి విన్నవించారు.

ఇదిలా ఉండగానే రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులు నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా ఆందోళన చేపడుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో పరిశ్రమపై దాడి విషయమై కేసు విచారణ జరగనున్న దృష్ట్యా తీర్పు ఏమి వస్తుందోనంటూ గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజుల ఆందోళన, మరోవైపు సుప్రీంకోర్టు కేసు విచారణ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తలనొప్పిగా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement