రైతుల సమస్యలపై రాజకీయం చేయవద్దని, రైతులకు అండగా నిలబడాలని ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల పక్షాన పాదాభివందనం చేసి చెబుతున్నానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో వచ్చేటువంటి ధాన్యం బాయిల్డ్ రైస్ తప్ప… వేరే రైస్ రాదన్నారు. ఎందుకంటే ఏప్రిల్, మే నెలలో వచ్చేటువంటి ధాన్యం ఖచ్చితంగా నార్మల్ గా పట్టిస్తే 40 శాతం కంటే ఎక్కువగా 60శాతం వేస్టేజ్ పోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టి గోదావరి, కృష్ణా జలాలను పంట పొలాలకు మళ్లించి, 24గంటల కరెంటు ఇచ్చి రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇచ్చి వ్యవసాయరంగాన్ని దండుగ కాదు.. పండుగ అనే వాతావరణంలోకి తీసుకువచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అర్థం పర్ధం లేని చర్యల వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. భారత ప్రధానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే రైతుల పక్షాన ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఢిల్లీలో కూర్చుని కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిందని కాగితాల మీద ప్రకటన చేయడం కాదు.. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరు సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పర్యవేక్షించాల్సిన బాధ్యత, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీమీద ఉంది కాబట్టి ఆలోచించాలని తెలిపారు. ఢిల్లీ పురవీధుల్లో జరిగిన అంత పెద్ద ఉద్యమం రైతు ఉద్యమం, ఎప్పుడు భారతదేశ చరిత్రలో జరిగలేదన్నారు. చివరికి నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా యు టర్న్ తీసుకోరు అంటారు.. కానీ నేడు వారి ఆలోచన విధానాలను యూటర్న్ తీసుకొన్నారన్నారు.
తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర విషయంలో జాప్యం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా ఒక మంచి ప్రణాళికతో ముందుకు రావాలని జిల్లా రైతాంగం పక్షాన ఒక్క రైతుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆనాడు జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి, దాని వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి అని చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు మొత్తం కూడా తుంగలో తొక్కి, కారు చౌకగా ఆయనకు ఎవరైతే భారత ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడం కోసం ఆర్థిక సహకారం అందించినా, వారికి ధారాదత్తం చేయాలని చూస్తున్నారన్నారు. తాను గత ఎన్నికల్లో నిలబడేటప్పుడు కానీ, అనేక సందర్భాల్లో భూపాలపల్లి పట్టణం నుంచి స్టేట్ రోడ్డు నుండి జాతీయ రహదారిగా తాను మొట్టమొదటి శాసనసభ సభ్యులుగా ఉన్నప్పుడు జాతీయ రహదారి కోసం ప్రభుత్వాన్ని ఒప్పించి సిరొంచ్చ నుండి చెన్నై వరకు చేయడం జరిగిందన్నారు. అప్పట్లో ఇంత ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. ప్రస్తుతం వందల సంఖ్యలో వాహనాలు వెళ్తున్న సందర్భంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, భూపాలపల్లికి ఒక్క బైపాస్ రోడ్డు కావాలని ముఖ్యమంత్రిని కోరిన వెంటనే చాలా త్వరగా స్పందించి, సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఆర్ అండ్ బీ, సింగరేణి, అటవీశాఖ, రెవెన్యూ అధికారులను పిలిచి అందుకు కావాల్సిన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని ఆదేశించడం జరిగిందన్నారు.
భూపాలపల్లిలో రూ.55కోట్లతో నూతన జిల్లా ప్రభుత్వ వైద్యశాల, మెడికల్ కాలేజ్, రూ.70 కోట్లతో డ్రింకింగ్ వాటర్ పనులు, రూ.70కోట్లతో చెల్పూర్ నుండి బాంబుల గడ్డ వరకు సైడ్ డ్రైన్, రోడ్డు విస్తరణ పనులు, రూ. 5.5 కోట్లతో 3 ఎకరాలలో మోడల్ వెజిటేబుల్, నాన్ వెజ్ మార్కెట్, రూ.2 కోట్లతో అధునాతన కమ్యూనిటీ ఫంక్షన్ హల్ మరొక్కటి ప్రపోజల్ లో కూడా ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే :
అనంతరం 3 లక్షల 45 వేల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 5 మంది లబ్ధిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ జనార్ధన్, యూత్ ప్రెసిడెంట్ రాజు, మహిళ టౌన్ అధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు, మైనార్టీ జిల్లా టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, టౌన్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital