ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : ప్రతి ఒక్కరూ చదవాలనే తపన, ఆసక్తి ఉంటే సాధించలేనిది ఏమీ లేదని, విద్యకు ధనిక, పేద అనే బేధం లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులకు, యువతకు ఉపయోగపడే విధంగా జిల్లా కేంద్రంలో రూ.1 కోటి నిధులతో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర , జిల్లా అడిషనల్ కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, జడ్పీ వైస్ ఛైర్పర్సన్ శోభ రఘుపతి రావు, మున్సిపల్ ఛైర్పర్సన్ వెంకట రాణీ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పిజి వరకు ఉచిత విద్యను అందిస్తున్నదన్నారు.
బీసీ, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ,కళాశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నదన్నారు. రాబోవు తరాలు మంచి నైపుణ్యం, విద్యను పొందడం కొరకు ఈ గ్రంథాలయం ఉపయోగపడుతుందన్నారు. పోటీ ప్రపంచంలో గ్రంధాలయాలు విద్యా బండాగారాలుగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. దాని కోసం రూ.1.కోటితో అత్యాధునిక హంగులతో కూడిన గ్రంథాలయంను నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అవసరం అయితే మరిన్ని వసుతుల కొరకు మరో రూ.1 కోటి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రంథాలయ భవన ఆవరణలో మంచి ఆక్సిజన్, నీడను ఇచ్చే చెట్లను పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా, పట్టణ ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.