Friday, November 22, 2024

సాగునీటి సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే దాసరి

సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలపై మాట్లాడారు. నియోజకవర్గంలోని రైతులు కాకతీయ కెనాల్‌ నుంచి సరఫరా అయ్యే నీటిపై ఆధారపడి సాగు చేసుకుంటారని, డీ-83, 86 ద్వారా నీటి సరఫరా జరుగుతున్న చివరి భూముల రైతాంగానికి సాగు నీరందడం లేదన్నారు. కెనాల్‌ పైభాగంలోని నీటి వినియోగం అధికంగా ఉండడంతో పెద్దపల్లి నియోజకవర్గంలో చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో సమస్య పరిష్కారం కోసం ఎన్నోసార్లు విన్నవించామని, స్పందించిన ముఖ్యమంత్రి వరద కాలువ నుంచి కాకతీయ కెనాల్‌కు ఉపకాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పనులు పూర్తయ్యాయన్నారు. వరద కాలువ ద్వారా నీటి సరఫరా జరిపితే తమ నియోజకవర్గ రైతులకు లబ్ధి చేకూరుతుందని విన్నవించారు. ఇందుకు సంబంధిత శాఖ మంత్రి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement