కడెం, డిసెంబర్ 25 (ఆంధ్రప్రభ) : కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఖానాపూర్ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. బుధవారం కడెం మండలంలోని మాసాయిపేట్ గ్రామంలో సీజీఎఫ్ రూ.20లక్షలు – గ్రామ ప్రజల విరాళం రూ.5లక్షలతో పునః నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంట్లో ఉండే తనను చట్టసభల్లోకి పంపిన ఈ ప్రాంత ప్రజల రుణం, గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీర్చుకుంటానని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. కడెం మండలంలోని లింగపూర్, దేవునిగూడెం, దస్తురాబాద్ గ్రామాల్లోని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. మాసాయిపేట్ హనుమాన్ ఆలయం ప్రహరీ గోడకు రూ.7లక్షలు మంజూరు చేశామని ప్రకటించారు.
త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పి.సతీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఏం మల్లేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముసుకు రాజు, ఆకుల లచ్చన్న, కే రాజేశ్వర్, మాసాయిపేట్ హనుమాన్, ఆలయ కమిటీ చైర్మన్, కే దినకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.