Home తెలంగాణ‌ WGL | హ‌మ్మ‌య్య‌.. ఆ విద్యార్థి దొరికాడు..

WGL | హ‌మ్మ‌య్య‌.. ఆ విద్యార్థి దొరికాడు..

0
WGL | హ‌మ్మ‌య్య‌.. ఆ విద్యార్థి దొరికాడు..

వరంగల్ / కరీమాబాద్, డిసెంబర్ 13 (ఆంధ్రప్రభ) : వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి కుడ్ల యశ్వంత్ దొరికాడు. వరంగల్ నగరం 34వ డివిజన్ శివనగర్ ఏకశిల డీజీ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం మధ్యాహ్నం ఇంటికి వెళుతున్నానని పాఠశాలలో చెప్పి బయటకు వచ్చి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే మిల్స్ కాలనీ పోలీసులకు సమాచారం అందించారు. సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ జె వెంకటరత్నం సకాలంలో స్పందించి విద్యార్థి ఆచూకీ గురించి ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

మధ్యాహ్నం మచిలీపట్నం వెళ్లే ట్రైన్ ను గుర్తించి రైల్వే ఆర్పీఎఫ్ సమాచారం అందించగా వరంగల్ ఆర్పీఎఫ్ అధికారులు అన్ని రైల్వే స్టేషన్లకు సమాచారం అందించారు. గురువారం అర్ధరాత్రి నెల్లూరు ఆర్పీఎఫ్ పోలీసులు తప్పిపోయిన విద్యార్థిని గుర్తించారు. విద్యార్థిని తమ సంరక్షణలో ఉంచుకొని వెంటనే వారు తల్లిదండ్రులకు, వరంగల్ ఆర్పీఎఫ్ సిబ్బందికి, మిల్స్ కాలనీ పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, నెల్లూరు ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. విద్యార్థి యశ్వంత్ దొరికాడనే సమాచారంతో నగరవాసులు ఊపిరిపీల్చుకొని ఆనందం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించిన మిల్స్ కాలనీ పోలీసులకు నగరవాసులు అభినందలు తెలిపారు.

Exit mobile version