ఆకతాయిల నుంచి అండగా నిలవాల్సిన పోలీసే పోకిరిగా మారాడు. న్యాయం చేయాలంటూ ఓ బాధితురాలు ఆశ్రయిస్తే వేధింపులకు పాల్పడ్డాడు. ఆ బాధిత మహిళతో వెకిలి వేశాలు వేసి చివరికీ సస్పెన్షన్ కు గురయ్యారు. ఈఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది.
మియాపూర్ పోలీస్ స్టేషన్ లో గిరీష్ కుమార్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఈ పోలీస్టేషన్ పరిధిలో ఓ బ్యూటీపార్లర్ నిర్వహించే మహిళ న్యాయం కోసం ఎస్సై గిరీష్ ను కలిసింది. వ్యాపారం పేరుతో నమ్మించి తన స్నేహితుడు రూ.6 లక్షలు తీసుకుని మోసం చేసాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో చీటింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు ఆమెకు స్నేహితుడి నుండి డబ్బులు ఇప్పించారు. దీంతో ఈ కేసు ముగిసింది.తన డబ్బులు వసూలు కావడంతో సదరు బ్యుటీషియన్ సంతోషిస్తుండగా మరో సమస్య వచ్చిపడింది.
తన సంతోషానికి కారణమైన పోలీసే వేధింపులకు దిగి బాధపెట్టడం ప్రారంభించాడు. కేసు విచారణ సమయంలో ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న ఎస్సై గిరీష్ తరచూ ఫోన్ చేయడం… అసభ్యంగా మాట్లాడటం చేయసాగాడు. అంతటితో ఆగకుండా ఆమె వెంటపడుతూ పోకిరీలా వ్యవహరించసాగాడు. ఎస్సై చేష్టలతో విసిగిపోయిన బ్యూటీషియన్ సైబరాబాద్ కమీషనర్ అవినాశ్ మహంతికి ఫిర్యాదు చేసింది. బాధ్యతాయుతంగా వుండాల్సిన ఎస్సై ఇలా బరితెగించి బాధిత మహిళను వేధించడాన్ని సిపి సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులతో విచారణ చేయించగా ఎస్సై బ్యూటీషియన్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నది నిజమేనని తేలింది. దీంతో మియాపూర్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు అవినాష్ మహంతి ఆదేశాలతో సైబరాబాద్ సిపి కార్యాలయం సస్పెన్షన్ వేటు వేసింది.