హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లిహిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటన దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. కస్టడీలోని నిందితులతో రేప్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడంతో పాటు పక్కాగా ఆధారాలను సేకరించే పనిని ముమ్మరం చేశారు. ఈ కేసు నిందితులలో మేజర్‌గా ఉన్న ఏ 1 ముద్దాయి సాదుద్దీన్ కస్టడీ గడువు ఆదివారం ముగిసింది. దీంతో పోలీసులు ఆదివారం ఉదయం సాదిద్దీన్‌తో పాటు మిగతా నిందితులతో కలిసి అత్యాచారం జరిగిన ప్రాంతంతో పాటు పబ్, బేకరీ తదితర ప్రాంతాలకు తీసుకు వెళ్ళి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సీన్ రికన్‌స్ట్రక్షన్ సీన్‌ను మొత్తం వీడియో చిత్రీకరణ జరిపారు. చంచల్‌గూడలోని ఏ1 ముద్దాయి సాదుద్దీన్‌తో పాటు జువెనల్‌హోంలో ఉన్న అయిదుగురు మైనర్లను పోలీసులు ఉదయం తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మైనర్ బాలికను ట్రాప్ చేసిన అమ్నీషియా పబ్‌కు అక్కడి నుంచి నిందితులు మైనర్ మైనర్ బాలికను తీసుకు వెళ్ళిన రోడ్ నంబర్ 14లోని కన్సూ బేకరికి, అక్కడి నుంచి అత్యాచారానికి పాల్పడ్డ జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 36కు, 44లకు తీసుకు వెళ్ళి ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భగా మరో సీసీ టీవీ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అమ్నీషియా పబ్‌లోనే నిందితులు బాలికను వేధించడం ప్రారంభించారు.
వీరి వేధింపులకు భరించలేని బాలిక పబ్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేందుకు సన్నద్దమవుతుండగా, కార్పొరేటర్ కొడుకు బాలికను ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెను నమ్మించి బేకరీకి తీసుకు వెళ్ళిన వారంతా బెదరింపులకు దిగి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నారు. కస్టడీ విచారణలో నిందితులు చెప్పిన అంశాలన్నింటిపై పోలీసులు సీన్ రికన్‌స్ట్రక్షన్ ద్వారా దృవీకరించుకున్నారు. పెద్దమ్మగుడి సమీపంలోని బహిరంగస్థలంలో బాలికపై ఎమ్మెల్యే కుమారుడు అఘాయిత్యానికి పాల్పడగా, మిగతా నిందితులు రోడ్ నబర్ 44లో దారుణానికి ఒడి గట్టారని పోలీసులు దృవీకరించుకున్నారు.
బాలికపై అత్యాచార ఘటన తర్వాత ఇన్నోవా వాహనాన్ని మొయినాబాద్‌లోని వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ ఫాంహౌజ్‌లో దాచాలన్న ఆలోచన ఎలా వచ్చింది. అక్కడి నుంచి ఇతర రాష్ట్రానికి పారిపోవాలన్న సలహా ఎవరిచ్చారు. సెల్‌ఫోన్‌లోని సిమ్‌లను గోవా పంపించి కర్నాటకకు పారిపోవాలన్న ఆలోచన ఎవరిదన్న కోణంలో పోలీసులు నిందితుల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
టాటూలా గుర్తుండేందుకు… బాలిక మెడపై కొరికారు
బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సమయంలో నిందితులు అత్యంత పైశాచికంగా ప్రవర్తించినట్లు వైద్య రిపోర్టులు చెబుతున్నాయి. బాలిక మెడపై బలమైన గాయముందని, ఈ గాయం కొరకడం ద్వారా అయ్యిందని వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు నిందితులను ప్రశ్నించగా బాలికపై అత్యాచారం జరిపిన సమయంలో మెడపై కొరకడం జరిగిందని, టాటూలా గుర్తుండాలన్న ఉద్దేశ్యంతో అలా చేయడం జరిగిందని చెప్పినట్లు తెలిసింది. నిందితుల ఆలోచన, వారి చేష్టలను తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. బాలిక శరీరంపై మొత్తం 12 చోట్ల గాయాలున్నాయని వైద్య నివేదిక పేర్కొంది. ఈ గాయాలన్నీ నిందితులు ఒకరిని చూసి మరొకరు చేసినవనిగా పోలీసులు గుర్తించారు.
ముగిసిన సాదుద్దీన్ కస్టడీ
అత్యాచార ఘటనలో మొదటి ముద్దాయిగా ఉన్న సాదుద్దీన్ కస్టడీ గడువు ముగిసింది. మిగిలిన అయిదుగురు మైనర్లలో ముగ్గురి కస్టడీ గడువు సోమవారంతో ముగియనుండగా, మరో ఇద్దరి కస్టడీ గడువు మంగళవారంతో ముగియనుంది. నిందితుల కస్టడీ గడువు ముగుస్తున్న తరుణంలో విచారణను మరింత వేగవంతం చేసి మరిన్ని ఆధారాలను, సమాచారాన్ని సేకరించాలన్న ఉద్దేశ్యంతో అధికారులు సమాచారాన్ని క్రోడీకరించుకునే పనిలో పడ్డారు.