ఓ మైనర్ బాలుడు ఎలక్ట్రిక్ బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కాడు. పోలీసులతో బాలుడు మాట్లాడిన తీరు విస్మయానికి గురి చేసింది. బబుల్ గమ్ నములుతూ తన సమాధానంతో పోలీసులకే షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్లితే… మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఓ బాలుడు తన స్నేహితుడిని ఎలక్ట్రిక్ బైక్ పై ఎక్కించుకుని రోడ్డుపైకి వచ్చారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఆ బాలుడి బైక్ ను ఆపారు. అయితే, బైక్ పైనుండి దిగకుండా నోట్లో బబుల్గం నములుతూ పొగురుబోతు తనంతో సమాధానం ఇచ్చాడు.
తనది ఎలక్ట్రిక్ బైక్ అని లైసెన్స్, హెల్మెట్ లేవని సమాధానం చెప్పారు. దీంతో పోలీసులు బాలుడి కుటుంబ సభ్యులను పిలిపించి సున్నితంగా మందలించి వదిలివేశారు. చిన్నతనంలోనే పెద్దలతో ఎలా మాట్లాడాలో పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలని పోలీసులు తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలను ఇచ్చి రోడ్లపైకి పంపిస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.
కాగా, మోటారు వాహన చట్టం-2019 ప్రకారం మైనర్‌కు వాహనం నడిపేందుకు అనుమతి ఇచ్చినందుకు యజమానికి కింద రూ.25,000 జరిమానా విధిస్తారు. బాలుడు హెల్మెట్ ధరించకపోవడం, లైసెన్స్ లేకపోతే పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంది.