వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం
ఎంత అవకాశం ఉంటే అన్ని నిధుల కేటాయిస్తాం
రైతుల మేలు కోసమే అభిప్రాయసేకరణ
రాజకీయ పార్టీల నుంచి కూడా వినతులు తీసుకుంటాం
అసెంబ్లీలో చర్చించి, రైతు భరోసాకు విధివిధానాలు రూపొందిస్తాం
వనపర్తి రైతు భరోసా వర్క్ షాప్‌లో మంత్రి తుమ్మల
ఆంధ్రప్రభ స్మార్ట్, మహబూబ్‌నగర్: చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం వనపర్తి కలెక్టరేట్‌లో రైతు భరోసా విధివిధానాలపై రైతుల నుంచి అభిప్రాయసేకరణకు రైతు భరోసా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.
వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం
వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంత అవకాశం ఉంటే అంత ఎక్కువ నిధులు వ్యవసాయరంగానికి కేటాయిస్తామన్నారు. రైతు భరోసా పథకం పేద, సన్నకారు రైతులకు ఆదుకునే విధంగా విధివిధానాలు రూపొందించాలని, ఎక్కడో నాలుగు గోడల మధ్య ఉండి రూపకల్పన చేయకుండా ప్రజాక్షేత్రంలో రైతులు అభిప్రాయాలు సేకరిస్తున్నామని అన్నారు. రైతులు అందరూ నిర్భయంగా తమ అభిప్రాయాలను వెల్లడించాలని సూచించారు.
అందరి అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చ
రైతుల అభిప్రాయాలు తీసుకున్న త్వరాత, రాజకీయ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటామన తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందరి అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు.
రెచ్చగొట్టే మాటలు తిప్పికొట్టాలి
రైతులను రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని, అలాంటి మాటలను తిప్పికొట్టాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు కూడా మంచి సూచనలు చేస్తే స్వీకరిస్తామని చెప్పారు. రైతు భరోసాపై ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, లోక్‌సభ సభ్యుడు మల్లు రవి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి , కలెక్టర్ , వివిధ ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.