హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుతో నియోజవకర్గం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యార్థి నాయకుడు, నిరంతరం ప్రజల కోసం కష్టపడే వ్యక్తిని టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. యువకుడు కాబట్టి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఆయన మరింత అభివృద్ధి చేస్తారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వమే ఆయనకు అండదండగా ఉందన్నారు. హుజూరాబాద్ భవిష్యత్‌లో బ్రహ్మాండమైన నియోజకవర్గంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు భారీ మెజారిటీతో ఆయనను గెలిపించాలని కోరారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తలసాని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు… ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలను అమలు చేస్తారా? అని ప్రశ్నించారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు 2014లోనే ప్రచారం చేశారని తలసాని గుర్తు చేశారు. ఆ తర్వాత 2018లోనూ అదే తరహాలో ప్రచారం చేసినా… ప్రజలు ఎవరూ నమ్మలేదని పేర్కొన్నారు. రూ.2లక్షల రుణమాఫీలు చేస్తామని హామీలిచ్చినా ఎవరూ నమ్మలేదని విమర్శించారు. దళితబంధు రాష్ట్రంలో అమలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, పథకం అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది కానీ నియోజకవర్గానికే పరిమితమవుతుందా? అని తలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు.