Wednesday, November 20, 2024

బండి పాదయాత్ర ఎందుకు? : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెటైర్లు వేశారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో ఆపార్టీ అధ్యక్షుడు పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలోకి రాక ముందు బీజేపీ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని విమర్శించారు. బండి సంజయ్‌ ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఐసీ, బిఎస్‌ఎన్‌ఎల్‌ అన్నీ ప్రైవేట్‌ పరం చేస్తున్నామని చెప్పేందుకు పాదయాత్ర చేస్తున్నారా? అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌ పై చేస్తున్న వ్యాఖ్యలు సరికావని మంత్రి అన్నారు. టీఆర్‌ఎస్‌ దృష్టి పేదల సేవ, రైంతాంగం సంక్షేమం పైనే ఉందన్నారు. కానీ బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని, ప్రవేశ పెడుతున్న సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్ర మంత్రులు ప్రశంసిస్తే రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఇక్కడ సమస్యలున్నాయంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పాద యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నాయకులు మాట్లాడితే యువత, మేధావులకు ఆదర్శంగా ఉండాలన్నారు. వారంతా రాజకీయాల్లోకి రావాలని అనుకోవాలని.. కానీ బీజేపీ నేతలు మాట్లాడే భాష విని విస్మయానికి గురవుతున్నారన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా ఇప్పటి నుంచే విషం చిమ్మడం తగదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు.  

ఇది కూడా చదవండిః బ్లాక్ మెయిల్ పనులు మానుకోః రేవంత్ కు మల్లారెడ్డి కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement