Saturday, November 23, 2024

కిడ్నాప్‌లకు మంత్రి సమాధానం చెప్పాలి.. పోలీసుల మౌనంపై అనుమానాలున్నాయి: డీకే అరుణ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్‌ పట్టణంలో నాలుగు రోజుల నుంచి కిడ్నాప్‌లు కొనసాగుతున్నాయని, కిడ్నాప్‌లు ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారనేది తెలియడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నాగరాజు అనే వ్యక్తిని ప్రైవేట్‌ వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారన్నారు. విశ్వనాథ్‌, యాదయ్య, రఘు అనే వ్యక్తులను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై ఉన్నఎలక్షన్‌ పిటిషన్‌ విత్‌డ్రా చేసుకోవాలి అని కిడ్నాప్‌ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోందన్నారు. కిడ్నాప్‌లు జరుగుతున్నా, పుకార్లు షికార్లు చేస్తున్నా పోలీసులు మౌనంగా ఉండటం కూడా అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.

కిడ్నాప్‌ అయిన వ్యక్తులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఏమైనా సంబంధం ఉందా తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. వీరందరినీ ఎస్‌వోటీ పోలీసులు తీసుకుపోతే పోలీసులే సమాధానం చెప్పాలన్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఏం జరుగుతుందో పోలీసులు ప్రజలకు వివరించాలన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ రెండుసార్లు అప్‌లోడ్‌ చేశారని, దీనిపై విచారణ చివరి దశకు చేరుకున్నందునే ఈ కిడ్నాప్‌లు జరుగుతున్నాయన్న చర్చ జరుగుతోందన్నారు. కిడ్నాప్‌లకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సంబంధం లేకపోతే మంత్రి సమాధానం చెప్పడానికి ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా ఎస్‌పీ అయినా ప్రజలకు వాస్తవాలను తెలపాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement