Saturday, November 23, 2024

కురవి భద్రకాళి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్న మంత్రి

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కురవి శ్రీ భద్రకాళి ఆలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. తన కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసి కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ప్రత్యేక పూజలు చేశారు. కురవి వీరభద్ర స్వామి వారికి బంగారు కొరమీసాలు, భద్రకాళి అమ్మవారికి బంగారు ముక్కుపుడక సమర్పించారు. ఈ రాష్ట్ర ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. కురవి ఆలయాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ వస్తే ఈ ఆలయానికి వచ్చి వీరభద్ర స్వామి వారికి బంగారు కోరమీసాలు, భద్రకాళి అమ్మవారికి ముక్కుపుడక చెల్లిస్తానని మొక్కుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చాక మొక్కులు చెల్లించారని, కురవి దేవాలయ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు.

 సీఎం కేసీఆర్ గారు కేటాయించిన నిధులతో ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చి కురవి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. కురవి ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ఇక్కడ హరిత హోటల్ నిర్మించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ గారిని కోరినట్లు తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో  కైలాస్ భవన్ పేరుతో గెస్ట్ హౌస్ ఉండేదని, హరిత హోటల్ నిర్మాణంతో ఈ ప్రాంతానికి పునః వైభవాన్ని తీసుకొస్తామన్నారు.

ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు ఇచ్చిన మాటను మూడేళ్లలోనే నెరవేర్చారని, ఈ ప్రాంతంలో కాలేశ్వరం జలాలతో రెండు పంటలు పండిస్తూ సుభిక్షంగా ఉందన్నారు. ఇచ్చిన మాటను నెరవేర్చి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్నారు. ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని మహాశివరాత్రి సందర్భంగా కోరుకున్నారని చెప్పారు. అనంతరం, కురవి జాతరలో తన మనవరాలు కియారా రాథోడ్ కు పీకలు కొనిపించి, వాటిని ఊదుతూ మంత్రి సత్యవతి రాథోడ్ సంతోషపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement