Friday, November 22, 2024

అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి హామీ

శనగకుంట అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహ సాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనిగకుంట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలను ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్,  ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం పరామర్శించారు. కాలిపోయిన ఇండ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు మనో ధైర్యం చెప్పారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అగ్ని ప్రమాదంలో కాలిపోయిన రైతులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు, రేషన్ కార్డులు, విద్యార్థులకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి అగ్నిప్రమాద బాధితులకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేయిస్తానని, వాటికి సంబంధించిన జీఓలతో తిరిగి మళ్లీ శనిగకుంట వస్తానని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు అడిగే వరకు పునరావాస కేంద్రాన్ని కొనసాగించాలని తెలిపారు. గ్రామంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకున్న మంగపేట ఎస్ఐ తాహెర్ బాబాను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement