రైతుబంధు ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుబంధు సంబరాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు రైతులను శాలువాలు కప్పి సత్కరించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబంధు సంబరాలు కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. గత ఏడు సంవత్సరాలుగా ఎన్ని అవాంతరాలు వచ్చినా నిరంతరాయంగా కొనసాగిస్తున్న అద్భుతమైన పథకం రైతు బంధు అని అన్నారు. రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని చెప్పారు. రైతుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న శ్రద్ధ అనిర్వచనీయమైనదని కొనియాడారు. ఆరుగాలం కష్టించి శ్రమించే రైతన్నకు అండదండగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు.
గతంలో జిల్లాలో 125 కోట్లు ఉన్న రైతుబంధు 202 కోట్లకు చేరుకున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కరోనాతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధికారులు, ప్రజాప్రతినిధుల వేతనాలను సైతం నిలుపుదల చేసి రైతుబంధు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించి ప్రత్యామ్నాయ పంటలను చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి సత్యవతి ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..