నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల భీమ్ గల్ కస్తూరిబా పాఠశాలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంరద్శించారు. ఈ పాఠశాలలో ఆహారం కలుషితం కావడంతో పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్ధినులు పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. వారు ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆసుపత్రి వర్గాలు తెలిపారు. కస్తూర్బా పాఠశాలలో సరైన వసతులు లేవని పాఠశాల సమీపంలో దుర్గంధం వ్యాప్తి చెందుతుందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలను సందర్శించిన మంత్రి…
కస్తూర్బా పాఠశాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఇన్చార్జిలే బాధ్యత వహించాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. వసతుల పట్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ఉపాధ్యాయులదేనని మంత్రి హెచ్చరించారు.