రంజాన్ పండుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సచివాలయంలో నేడు అధికారులు, ప్రజాప్రతినిధులతో రంజాన్ ఏర్పట్లుపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతు.. మసీదుల వద్ద శామియానాలు, నీటి వసతి, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్న మొదటి రంజాన్‌ను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
మంచినీటి ట్యాంకర్లు అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఉంచడంతో పాటు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనపు శానిటేషన్ టీమ్స్‌ని ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు.
షాపులు 24 గంటలు నడుపుకోవడాన్ని పరిశీలించాలని, పుట్ పాత్‌లపై ఉండే చిరు వ్యాపారులను ఇబ్బందులు కలిగించవద్దని హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండ పోలీస్ అధికారులతో పాటు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు. రంజాన్ పండుగ నిధుల విడుదలపై సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. రంజాన్ నెలరోజులు ప్రశాంతమైన పండుగ వాతావరణంలో జరుపుకునే విధంగా కృషి చేయాలని అధికారులని మంత్రి పొన్నం అదేశించారు.
వీధి దీపాలు వెలిగేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.కరెంటు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు ను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకూడదు అని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.