Tuesday, November 19, 2024

TS : విద్యుత్‌స‌బ్‌స్టేష‌న్ ప‌రిశీలించిన మంత్రి పొన్నం…విద్యుత్ ప్ర‌మాదంపై ఆరా….

సిద్దిపేటలో బుధ‌వారం రాత్రి విద్యుత్‌ కేంద్రంలో 220కేవీ/132కేవీ ట్రాన్స్‌ఫార్మ‌ర్ పేలి ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం రాష్ట్ర రవాణా ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గృహ వాణిజ్య అవసరాలతో పాటు వ్యవసాయ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గృహ వినియోగదారులు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామ‌ని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే హైదరాబాద్ నుండి ట్రాన్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు విద్యుత్ శాఖ ఎస్ఇ, అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి పక్క ట్రాన్స్‌ఫార్మర్ కు వ్యాపించకుండా చర్యలు తీసుకొని సమీపంలోని ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ నుండి గృహ అవసరాలకు విద్యుత్ పునరుద్ధరించార‌న్నారు. ఉదయం 5 గంటలకు వ్యవసాయానికి కూడా సరఫరా చేయడం జరిగింద‌ని తెలిపారు. విద్యుత్ ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు మరియు నష్టం అంచనా వేయడానికి ప్రాథమిక విచారణ జరిపించేందుకు ప్రభుత్వం తరఫున అధికారులను ఆదేశిస్తామన్నారు. పేలిపోయిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ చాలా పాతదని, అది ఇప్పటికే దానికి కెపాసిటీ మించి పనిచేసిందని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement