సిరిసిల్ల, సెప్టెంబర్ 6 (ప్రభన్యూస్): దుబాయ్‌లోని అవీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల విడుదల కోసం మంత్రి కేటీ-ఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారు. తన దుబాయ్ పర్యటనలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెట్టుబడుల పర్యటన కోసం దుబాయ్‌లో పర్యటించిన కేటీఆర్, ఖైదీల విడుదల అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ కేసుని వాదిస్తున్న అరబ్ లాయర్, దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇందులో పలువురితో ప్రత్యేకంగా సమావేశమై కేసు పురోగతి విషయాన్ని తెలుసుకున్నారు. ఖైదీల క్షమాభిక్ష కోసం ప్రయత్నం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేష్, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ఒక కేసులో భాగంగా దుబాయ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపు ఇప్పటికే 15 సంవత్సరాలకు పైగా తమ జైలు శిక్ష పూర్తి చేసుకున్నారు. వీరి విడుదల కోసం మంత్రి కేటీఆర్ స్వయంగా చొరవ చూపి, సుదీర్ఘ కాలంగా అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే ఈ నేరంలో ప్రాణాలు కోల్పోయిన నేపాల్ కు చెందిన బాధిత కుటుంబం దగ్గరికి స్వయంగా వెళ్లి మంత్రి కేటీఆర్, దియ్య సొమ్ము (బ్లడ్ మనీ) అందించారు. ఆ తర్వాత ఆ కుటుంబం క్షమాభిక్ష పత్రాన్ని దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించి క్షమాభిక్ష కూడా కోరారు. అయితే కొన్ని కారణాలు, నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దుబాయ్ ప్రభుత్వం క్షమాభిక్షను ఇప్పటిదాకా ప్రసాదించలేదు. ఆరు నెలల కింద మరోసారి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దుబాయ్ లాయర్‌కు అవసరమైన ఫీజులు చెల్లించి, తన కార్యాలయ అధికారులను దుబాయ్ పంపించి మరీ ఈ వ్యవహారం తాలూకు పురోగతిని సమీక్షించారు. ఇప్పటికే బాధ్యత కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహాన్ని షరియా చట్టం ప్రకారం దియ్యా(బ్లడ్ మనీ) రూపంలో అందించడం జరిగిందని, ఆ తర్వాత 2013 లోనే నేపాల్ విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని క్షమాభిక్షకు అవసరమైన అన్ని రకాల పత్రాలను దుబాయ్ ప్రభుత్వానికి భారత కాన్సుల్ జనరల్ కార్యాలయం ద్వారా అందించడం జరిగిందన్నారు.
అయితే ఇప్పటిదాకా నిందితులకు ఉపశమనం లభించలేదని మంత్రి కేటీఆర్ బుధవారం జరిగిన పలు సమావేశాల సందర్భంగా అటు భారత కాన్సిల్ జనరల్ కార్యాలయ అధికారులకు, దుబాయ్ ప్రభుత్వాధికారులకు తెలియజేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు శిక్ష అనుభవించి జైలు అధికారుల ద్వారా మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలుగా నివేదిక కూడా కలిగి ఉన్న తెలంగాణ ఎన్నారైలకు వెంటనే క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. తన పర్యటనలో భాగంగా అటు దుబాయ్ కాన్సల్ జనరల్‌గా వ్యవహరిస్తున్న రామ్ కుమార్‌తోపాటు ఈ కేసు వాదిస్తున్న అరబ్ లాయర్, బాధిత కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు, పలువురు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల తో మంత్రి కేటీఆర్ ప్రత్యక్షంగా సమావేశమై క్షమాభిక్ష ప్రక్రియ పురోగతి వివరాలు తెల్సుకుని, ఈ అంశంలో సహకారం అందించాలని కోరారు. తన వ్యక్తిగత స్థాయిలో, అటు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఇప్పటికే తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ ద్వారా క్షమాభిక్ష ప్రసాదిస్తేనే తెలంగాణ ఎన్నారై ఖైదీలకు ఉపశమనం లభిస్తుందని, ఈ దిశగా ప్రయత్నం చేయాలని మంత్రి కేటీఆర్ తాను కలిసిన పలువురికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో దుబాయ్ కాన్సుల్ జనరల్ కార్యాలయం చొరవ తీసుకోవాలని కాన్సుల్ జనరల్ రామ్ కుమార్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జరిగిన బిజినెస్ సమావేశాల సందర్భంగా రాజ కుటుంబానికి అత్యంత దగ్గర ఉన్న పలువురు వ్యాపారవేత్తలతో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి, మానవతా దృక్పథంతో తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం సహకరించాలని కోరారు. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, దుబాయ్ ప్రభుత్వంతో ఈ విషయాన్ని స్థానిక చట్టాల మేర చర్చించేందుకు పనిచేస్తామన మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు.