Thursday, November 21, 2024

గొప్ప‌గా తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రిపాల‌న: మంత్రి కేటీఆర్

తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నెల 25న హైటెక్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ టీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం ఏర్పాట్ల‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ గురువారం ప‌రిశీలించారు. అనంత‌రం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నాము అని తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. త‌మ పార్టీ విధానాల‌ను, ప‌రిపాల‌న‌ను మెచ్చి ప్ర‌జ‌లు మ‌రోసారి ఆశీర్వ‌దించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రిపాల‌న గొప్ప‌గా సాగుతుంద‌ని, అపూర్వ‌మైన విధానాల‌తో, పాల‌సీల‌తో దేశంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచామ‌న్నారు.

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పథకాలను, కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. రైతుబంధు, మిష‌న్ భ‌గీర‌థ‌ ప‌థ‌కాన్ని స్ఫూర్తిగా తీసుకొని పీఎం కిసాన్‌, జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌ను కేంద్రం ప్రారంభించింద‌ని తెలిపారు. టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్రం త్వరలో తీసుకురాబోతున్న‌ద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు బెంగాల్ చేసే పనిని రేపు భారత్ చేస్తుంది అనే నినాదం ఉండేది… కానీ ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తుందో.. రేపు భారత్ అదే చేస్తుంది అన్నట్లుగా మారింద‌న్నారు.

25న జ‌రిగే పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చే పార్టీ ప్రతినిధులతో పాటు.. మొత్తం సమావేశం సజావుగా సాగేలా అనేక ఏర్పాట్లను చేస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. సభ నిర్వహణ, దానికి సంబంధించిన ఏర్పాట్లను, కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరపున పలు కమిటీలను కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఆహ్వాన కమిటీ, సభా వేదిక ప్రాంగణం, నగర అలంకరణ, ప్రతినిధుల నమోదు వాలంటీర్ల కమిటీ, పార్కింగ్, భోజన కమిటీ, తీర్మానాల కమిటీ, మీడియా కమిటీల‌తో పాటు ఇత‌ర క‌మిటీల‌ను కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ సమావేశానికి వచ్చే ప్రతినిధులకు పార్టీ తరఫున గుర్తింపు కార్డులను అందిస్తామ‌న్నారు. పార్టీ ఆహ్వానించిన వారు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీలో థియేటర్లకు 100% ఆక్యుపెన్సీ.. ఆ సినిమాలకు కాసులే..

Advertisement

తాజా వార్తలు

Advertisement