Friday, November 22, 2024

‘చరిత్రపుటల్లో తెలంగాణ’ గ్రంథం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కులమత సంకెళ్ళలో చిక్కుకుంటే దేశం పురోగమించలేదని, మానవ సంపదైన యువతరం సెక్యూలర్‌ భావాలతో ఎదగాలని మున్సిపల్‌ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ కేంద్ర కార్యాలయంలో బుధవారం నాడు ప్రొఫెసర్‌ జి. లక్ష్మణ్‌ సంపాదకత్వంలో వెలువరించిన చరిత్రపుటల్లో తెలంగాణ అనే గ్రంథాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దూసుకుపోవాల్సిన సమయంలో కుల, మత ప్రస్తావనల్లో కొట్టుకుపోతే అది దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ చరిత్రలను అధ్యాయనం చేస్తున్న విద్యార్థులు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలపై దృష్టి సారించాలన్నారు.

దేశంలో మానవత్వంపై దాడి జరుగుతున్నప్పుడు అలోచనపరులైన యువతరం స్పందించాలన్నారు. యువతరం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, లేకపోతే కులం, మతం పేరుతో కొట్లాడుకునే విషవలయంలో చిక్కుకుంటామని ఆయన తెలిపారు. దేశంలో ప్రస్తుతం మతం మత్తుమందులా తయారైందని, తెలంగాణ సమాజం యావత్తు ఝాగురూకతతో ఉండాలన్నారు. లేకపోతే జర్మన్‌ కవి చెప్పినట్లు హిట్లర్‌ కాలంలో నాజీలు మనకోసం వచ్చే వరకు కూడా మేల్కోలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మతం రాజకీయ పార్టీ ముసుగు వేసుకుని వస్తే అది దేశాన్ని గందరగోళ పరుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు పుడుతూనే ఉంటారని, ప్రస్తుతం కేసీఆర్‌ ఎదురు తిరిగారని, దేశమంతా ప్రశ్నించే గొంతులు పెరుగుతున్నాయని అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ చరిత్రను, పోరాటాన్ని, జరిగిన ఉద్యమాలు, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం, జాతర పండుగలు అనేకాంశాలను గ్రంథస్తం చేసిన ప్రొఫెసర్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, గ్రంథ రచయితలు ప్రోఫెసర్‌ జి. లక్ష్మణ్‌, ప్రోఫెసర్‌ మాదాడి వెంకటేశ్వర రావు, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి కోయి చంద్రమోహన్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement