భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబుతో పాటు మరికొందరు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కాగా, కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు సీఎం కేసిఆర్ స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం సంతోష్‌బాబు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలాన్ని సైతం అందించారు.