Saturday, November 23, 2024

తెలంగాణలో సింగపూర్ కంపెనీల పెట్టుబడులు

తెలంగాణలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని తెలిపారు. ఒకవైపు ఆధునిక రంగాలలో పెట్టుబడులతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు ఇక్కడ ఉన్న అవకాశాల‌ పట్ల ఆసక్తితో ఉన్నాయని చెప్పారు.

మంగళవారం ప్రగతి భవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్ సిమోన్ వాంగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను, వివ‌రాల‌ను వాంగ్‌కు కేటీఆర్ అందించారు. హైద‌రాబాద్ న‌గ‌రం కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల నుంచి దేశంలోని ఇత‌ర న‌గ‌రాల‌కు భిన్నంగా కాస్మోపాలిట‌న్ స్వ‌భావంతో అభివృద్ధి చెందుతూ వ‌స్తుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. అద్భుత‌మైన ప్ర‌భుత్వ విధానాల‌తో పాటు టీఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమ‌తుల వంటి వాటితో అనేక అంత‌ర్జాతీయ పెట్టుబ‌డుల‌ను తెలంగాణ‌కు తీసుకురాగ‌లిగామ‌న్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిక‌ల్చ‌ర్ వంటి ప‌లు రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు అద్భుత‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికే అనేక సింగ‌పూర్ కంపెనీలు రాష్ర్టంలో పెట్టుబ‌డులు పెట్టి త‌మ కార్య‌క‌లాపాల ప‌ట్ల సానుకూలంగా ఉన్నాయ‌ని కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement