Saturday, November 23, 2024

మోడీ పాల‌న‌లో వంట గ‌దుల్లో మంట‌లు – మంత్రి కేటీఆర్

గ్యాస్ ధ‌ర‌ల పెంపుతో కేంద్ర‌ప్ర‌భుత్వ తీరుపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ మ‌రోసారి మండిప‌డ్డారు. గ‌డియ‌కోసారి పెరుగుతున్న గ్యాస్ ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌ల‌కు గుండె ద‌డ వ‌స్తోంద‌న్నారు. మోడీ పాల‌న‌లో వంట గ‌దుల్లో మంట‌లు పుడుతున్నాయ‌ని పేర్కొన్నారు. బీజేపీ ప్ర‌భుత్వం ధ‌ర‌లు పెంచి దేశ ప్ర‌జ‌ల‌పై దొంగ దాడి చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌ట్ట‌డి చేయ‌లేని దౌర్భాగ్య పాల‌న‌లో దేశం ఉంద‌న్నారు. గ్యాస్ ధ‌ర పెంపుపై నిర‌స‌న చేప‌ట్టిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు కేటీఆర్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేంద్ర అస‌మ‌ర్థ పాల‌న విధానాల‌పై నిరంత‌ర పోరు సాగిస్తామ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. ప్రధాని న‌రేంద్ర మోడీ ఆస్తవ్యస్త ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట పుట్టిందని కేటీఆర్ ఆరోపించారు. 8 సంవత్సరాల అసమర్థ మోడీ పరిపాలనలో సుమారు 170 శాతం పెంపుతో, ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక రేటుకు వంట గ్యాస్ అమ్ముతున్న ప్రభుత్వంగా ప్రపంచ రికార్డ్ సృష్టించిందని విమర్శించారు.

తాజాగా పెంచిన రూ. 50తో ఈ ఏడాది కాలంలోనే రూ. 244 మేర గ్యాస్ బండ రేటును పెంచిన మోదీ పాలనను చూసి అరాచకత్వం కూడా సిగ్గుతో తలదించుకుంటుందన్నారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 410గా ఉన్న సిలిండర్ ధర ఈ రోజు సుమారు మూడు రెట్లు పెరిగి రూ. 1100 దాటడం దురదృష్టకరమన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 1100పైగా గ్యాస్ రేటు చేరడం బీజేపీ అసమర్థ పరిపాలనకు నిదర్శనమన్నారు. ధరేంద్ర మోడీ హయాంలో సిలిండర్ బండ ధరలతో పేదల్ని బాదే కార్యక్రమం అడ్డూ అదుపు లేకుండా సాగుతుందన్నారు. రాయితీకి రాం రాం చెప్పి..సబ్సిడీ ఎత్తేసి దేశ ప్రజలపై మోదీ దొంగ దాడి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement