ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణాన్ని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి భవన్ ప్రాంగణంలో సైట్ ఇన్స్పెక్షన్ చేశానన్నారు. ఏపీ తెలంగాణ భవన్ విభజనలో ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. విభజనలపై వివాదం కూడా పెద్దగా ఏమీ లేదన్నారు. దీని గురించి హైదరాబాద్ వెళ్లాక సీఎం తో కూర్చుని చర్చిస్తానన్నారు. త్వరగా విభజన పూర్తి చేసి కొత్త భవనం కోసం మార్చి లోగా శంకుస్థాపన చేయాలన్నది తమ ఉద్దేశమన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఉమ్మడి ఏపీ భవన్ విభజన అంశం అపరిష్కృతంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఏపీ భవన్ విభజన వివాదం అపరిష్కృతంగానే ఉందన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించి ఉమ్మడి భవన్ ఆస్తులను పంచుకోవాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.