గద్వాల ప్రతినిధి, డిసెంబర్ 12 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల జిల్లా కలెక్టరేట్ లో సివిల్ శాఖ సప్లయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సివిల్ సప్లయ్ అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. గతంలో మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధిపై మంత్రి అరా తీశారు. అవినీతికి పాల్పడిన మిల్లర్లపై జిల్లా అధికారులు ఎందుకు పీడీ యాక్ట్ నమోదు చేయడం లేదనగా.. అధికారులు నీళ్లు నమిలినట్లు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్లు జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు.
మంత్రి జూపల్లికి ఘన స్వాగతం…
గద్వాలకు విచ్చేసిన ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఘన స్వాగతం లభించింది. జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ అసెంబ్లీ ఇంచార్జీ సరిత అనంతపురం స్టేజి వద్ద గజమాలతో తన అనుచర సైన్యంతో ఘనమైన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంజిపేట శంకర్, మధుసూదన్ బాబు, బండ్ల రాజశేఖర్ రెడ్డి, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దొడ్డి రామకృష్ణ, ఈశ్వర్, పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంత్రి జూపల్లి ని సన్మానించిన గద్వాల ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్..
గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించేందుకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావుని మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, మున్సిపల్ కౌన్సిలర్లు వారికి శాలువా కప్పి పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించి, ఘనస్వాగతం పలికారు.