Tuesday, November 19, 2024

TG: మంత్రి జూప‌ల్లికి స్వ‌ప‌క్షం నుంచే అస‌మ్మ‌తి సెగలు..

గద్వాల (ప్రతినిధి) ఆగస్టు 17 (ప్రభ న్యూస్) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగలు తాకాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ ను అడ్డుకున్నారు కాంగ్రెస్ పార్టీ సరితా తిరుపతయ్య వర్గం వారు. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య ఇంటిలో మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపిన అనంతరం ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లారు మంత్రి, సరితా తిరుపతయ్య.

వివరాల్లోకి వెళితే.. ఇవాళ‌ ఉదయం గద్వాల జిల్లా కేంద్రానికి మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకొని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గద్వాల నియోజకవర్గంలోని ధరూరు మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్, గూడెందొడ్డి రిజర్వాయర్, గట్టు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించడానికి వెళుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ ను గంజి రోడ్డు సమీపంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య వర్గం అడ్డుకున్నారు.

ప్రతిసారి మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల ప్రాంతానికి వచ్చినప్పుడల్లా సరిత తిరుపతయ్య వర్గం వారికి అవమానాలకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించడం లేదని సరితా తిరుపతయ్య వర్గం మంత్రి జూపల్లి కాన్వాయ్ ను అడ్డుకోవడం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు సరిత తిరుపతయ్య నివాసానికి చేరుకొని సుమారు అరగంట పాటు సరిత తిరుపతయ్య నివాసంలో చర్చలు జరిపారు.

- Advertisement -

అనంతరం సరిత తిరుపతయ్య మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చారని వారిని మనం అడ్డుకోకూడదని, మన ప్రాంత అభివృద్ధి కోసం వచ్చినప్పుడు మనం అందరం సహనంతో ఓర్పుతో సహకరించాలని కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ అందరం పార్టీ కోసం పని చేస్తామని, ఏదైనా మన సమస్యను ఉంటే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి దాని పరిష్కరించే విధంగా మనం ప్రయత్నం చేయాలి కానీ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును అడ్డుకోవడం సబబు కాదన్నారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సరితా తిరుపతయ్య వర్గం వారు శాంతించారు. అనంతరం మంత్రితో పాటు సరితా తిరుపతయ్య ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement