సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నామినిషన్ ప్రక్రియ ముందు తమ కుటుంబానికి సెంటిమెంట్ గా వస్తున్న పలు ఆలయాలను సందర్శించారు. తొలుత ఆత్మకూర్ మండలం నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత నకిరేకల్ నియోజకవర్గంలోని పాలెం లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ముడుపుకట్టి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడ నుండీ అర్వపల్లిలోని శ్రీశ్రీశ్రీ యోగానంద లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో తుంగతుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ తో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత సూర్యాపేట పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తన నివాసానికి చేరుకుని అక్కడ తన తండ్రి చంద్రారెడ్డి, అక్కా- బావ అయిన కట్టా శేఖర్ రెడ్డి- రేణుక దంపతులకు, అన్న వదినలు రమేష్ రెడ్డి,- మణిమాల దంపతులకు పాదాభివందనం చేశారు. అనంతరం నియోజకవర్గ నలుమూలల నుండి స్వచ్ఛందంగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తల నినాదాల నడుమ ధర్మ బిక్షం చౌరస్తాకు వెళ్లారు. అక్కడి నుండి పాదయాత్ర ద్వారా ర్యాలీగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు బయలుదేరి వెళ్లారు.