నిర్మల్, ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రభ న్యూస్) : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శాస్త్రినగర్ లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పెరేడ్ గ్రౌండ్ లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షాలు తెలిపారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ… బ్రిటిష్ సామ్రాజ్యాధికారుల నుండి దాస్య విముక్తి గావించడం కోసం ఎందరో వీరాధివీరులు, మహనీయులు తమ ప్రాణాలొడ్డి జీవితాలను అర్పించారని వారి సేవలను కొనియాడారు. వలస పాలన తర్వాత ఈ 77 ఏండ్లలో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి బాటలో దూసుకుపోతుందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం వస్తుందని, 78 స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో కూడా సీఎం కేసీఆర్ గోల్కొండ కోట నుంచి జాతీయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.