నిర్మల్ పట్టణంలోని బంగల్ పెట్ లో నిర్మించే శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం నిర్మల్ కే తలమానికంగా ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం మహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయ పనులను ఆయన పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి రాతి కట్టడాలతో బంగల్ పెట్ అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఆలయం నిర్మాణం కోసం రూ. 3 కోట్ల నిధులు వెచ్చించనున్నామని చెప్పారు. ప్రతి ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. వచ్చే సంవత్సరం ఆగస్టులోపు ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. పోచమ్మ, తాతాయి ఆలయాలను 20 లక్షల తో నూతనంగా నిర్మించనున్నట్లు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలో ప్రతి ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గంలో కొత్త పాత కలిపి 600 ఆలయాలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.
అంతకుముందు మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital