కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం మరోసారి లేఖ రాశారు. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయడంతో పాటు గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడగించాలని కోరారు. నీతి ఆయోగ్ సూచించిన మేరకు రూ.24,205 కోట్లు ఇవ్వాలన్నారు.
స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.502.29 కోట్లు) ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అకారణంగా తిరస్కరించిందని, రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్ధిష్ట కారణం లేకుండా గ్రాంట్లను తిరస్కరించారన్న ఆయన వీలైనంత త్వరగా వాటిని విడుదల చేయాలన్నారు. 2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని ఈ మేరకు తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని, ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో ఎప్పుడూ తిరస్కరించిన సందర్భాలు లేవన్నారు. ఈ మొత్తాన్ని తెలంగాణకు విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital