గిరిక తాటి చెట్ల ప్రయోజనాలను గీత కార్మికులకు అందిoచేదుకే ఉచితంగా అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం సమీపంలోని తేజోవనంలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో గౌడ కులస్తులకు ఆయన గిరిక తాటి మొక్కలను పంపిణీ చేసి మాట్లాడారు. గిరిక తాటిచెట్లు ప్రయోజనాలు తెలిసే రెండేళ్లలో గీత కార్మికులకు 4 వేల మొక్కలు పంపిణీ చేశామని చెప్పారు. సంప్రదాయ తాటిచెట్ల నుంచి కల్లు రావాలంటే 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. గిరిక తాటి నుంచి 5ఏండ్లలోనే కల్లు వస్తుందన్నారు. సాధారణ తాటిచెట్లు రోజుకు 5 నుంచి 10 సీసాల కల్లునిస్తే, గిరిక తాటి 40 నుంచి 100 సీసాలు వస్తుందన్నారు. వర్షాకాలం మినహా ఏడాదిలో 8 నెలలు కల్లు తీయవచ్చని తెలిపారు.
చక్కెర వ్యాధిగ్రస్తులు కూడా గిరిక తాటి కల్లు సేవించవచ్చు. వీటి ఎత్తు కూడా గరిష్ఠంగా 7 మీటర్ల వరకే ఉంటుంది. ఒక్క గిరిక తాటిచెట్టు 10 సంప్రదాయ తాటిచెట్లకు సమానమని మంత్రి స్పష్టం చేశారు. గీత కార్మికులకు ప్రయోజనకరంగా కలిగించేలా ఉన్నందునే ప్రభుత్వం మొక్కలను కొని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంకుషాపురం, గుర్రాల గొంది, చిన్న గుండవెల్లి మినహా మిగతా గ్రామాల్లో మొక్కల సంరక్షణ ఆశించిన మేర లేదన్నారు. ఇకపై మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించే వారికే తిరిగి మరిన్ని అందిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజవర్గాల్లోనీ గీత కార్మికులకు మొక్కలను పంపిణీ చేస్తా మన్నారు. క్షేత్ర స్థాయిలో మొక్కల సంరక్షణ తీరును పర్యవేక్షించేoదుకు 4 గ్రామాలకు ఓ ఆబ్కారీ కానిస్టేబుల్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు.
గీత కార్మిలకు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకoగా పెట్టిన మాదిరి సిద్దిపేటలోనూ నీరా సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. గౌడ కులస్తుల కోసం చేపట్టిన ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించి 5 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు.