గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ పట్టణం జలమయం అయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కరీంనగర్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయని అన్నారు. వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు శ్రమిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న మంత్రి.. పలు చోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు. మొత్తం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. మున్సిపల్ సిబ్బంది మెదలు, రెవెన్యూ, ఇరిగేషన్, వాటర్ వర్క్స్, పోలీస్ శాఖలతో సహా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పటివరకూ ప్రాణనష్టం జరగలేదన్నారు. కాళేశ్వరం వల్ల గత సీజన్ నుండి అన్ని జలాశయాలు నిండు కుండల్లా మారి గ్రౌండ్ వాటర్ లెవల్ భూర్భజలాలు పెరిగాయన్నారు. అందుకే చిన్నవర్షాలు సైతం వరదలుగా మారుతున్నాయన్నారు.
మరోవైపు కరీంనగర్ జిల్లాలో 15.31 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. జిల్లాలోని మానేరు, మోయతుమ్మెద, చిలుక, శంకరపట్నం, ఇరుకుల్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాల్లో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. చెరువులు, కుంటల్లోకి భారీ వరద వచ్చి చేరుతోంది.