గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలు, వైద్య శాలలను బాగు చేసే పనిని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సీజిఐ సౌజన్యంతో బాల వికాస ప్రతినిధులు శౌరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కిట్లు, హాండ్ వాష్, యూనిట్లను నియోజకవర్గంలోని ఐదు మండలాల ఉన్నత పాఠశాలలకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయల వ్యయంతో మన ఊరు మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ సంవత్సరం 3 వేల 497 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 9 వేల 123 ప్రభుత్వ పాఠశాలను బాగు చేస్తున్నామన్నారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో మొత్తం 104 ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు.
నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలోని 24 పాఠశాలలో, కొడకండ్ల మండలంలోని 11 పాఠశాలల్లో, పెద్దవంగర మండలంలోని 12 పాఠశాలల్లో, దేవరుప్పుల మండలంలోని 18 పాఠశాలలో, రాయపర్తి మండలంలోని 21 పాఠశాలలో, తొర్రూరు మండలంలోని 18 పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని అమలు చేయడానికి విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారని వివరించారు. ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పాటుగా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో డిజిటల్ విద్య అమలు, విద్యుదీకరణ, త్రాగునీటి సరఫరా, సరిపడా ఫర్నీచరు, అవసరమైన మరమ్మతులు, పాఠశాలకు రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డ్ ల ఏర్పాటు, ప్రహరీ గోడ నిర్మాణం. కిచెన్ షెడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ ల నిర్మాణం, నీటి సౌకర్యాలతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు. అయితే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు తమ నియోజకవర్గాల్లో పాఠశాలల ను అద్భుతంగా తీర్చిదిద్దారు. అంతకన్నా మంచిగా మన నియోజకవర్గ పాఠశాలలు ఉండాలన్నారు. పాలకుర్తి పాఠశాలకు ఒక బస్సు కూడా ఉండాలని అందరి చప్పట్ల మధ్య చెప్పారు.
నైట్ వాచ్మెన్ బిక్షపతి తన వంతు విరాళంగా 10 వేలు ప్రకటించారు. NRI మెతుకు ఉపేందర్ 10 వేలు ప్రకటించారు. కాగా బిక్షపతిని మంత్రి ఘనంగా సన్మానించారు.