ఐటి దిగ్గజ కంపెనీ జెన్ ప్యాక్ట్ వరంగల్ లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించిడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది వరంగల్ ప్రజలకు శుభవార్త! అని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఐటి శాఖ మంత్రి కేటీఆర్ గారితో జరిగిన సమావేశం అనంతరం ఆ కంపెనీ సీఈఓ త్యాగరాజన్ ఈ ప్రకటన చేయడం, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. తెలంగాణలో అభివృద్ధి విస్తరించాలని, అందుకు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి కంపెనీలను తీసుకువెళ్లాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా.. పెద్ద కంపెనీలు వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలకు వస్తున్నాయని చెప్పారు.
వరంగల్ లో ఇప్పటికే టెక్ మహీంద్రా, సయింట్ ఆఫీస్ లు ఉండగా.. తాజాగా జెన్ ప్యాక్ట్ రావడం వరంగల్ వాసులకు గొప్ప వార్త అన్నారు. ఈ కంపెనీల రాకతో ఇక్కడి నిరోద్యోగ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. ఐటీ దిగ్గజ కంపెనీలు వరంగల్ కు రావడానికి దార్శనికులు సీఎం కెసిఆర్, ఐటి మంత్రి కేటీఆర్ ల కృషే కారణమన్నారు. వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, తన పక్షాన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.