ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నష్టాలను వెంటనే అంచనా వేయాలని, రెండు మూడు రోజుల్లోనే తనకు నివేదికలు పంపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఆయా రోడ్ల మరమ్మతులను త్వరిత గతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్లు, ఉపాధి హామీ పథకం రోడ్లు, పీఎంజీఎస్వై రోడ్లు ప్రగతి వంటి పలు అంశాల పై వరంగల్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయం, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవలి భారీ వర్షాలకు కొన్ని చోట్ల రోడ్లు తెగిపోయాయి. మరికొన్ని చోట్ల గతుకుల మయం అయ్యాయి. ఇంకొన్ని చోట్ల వరదలకు రోడ్లు కోసుకుపోయాయి. అలా వర్షాలకు నష్టం జరిగిన పిఆర్ రోడ్ల వివరాలు, నష్టం అంచనాలు, వాటి మరమ్మతులకు ప్రతిపాదనలతో రెండు, మూడు రోజుల్లో అధికారులు మళ్ళీ సమావేశం కావాలని మంత్రి అదేశించారు. వాటి మరమ్మతులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా, రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు