Wednesday, November 13, 2024

గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి: మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో 60 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామలలో ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావడానికి మండల పరిషత్ అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఉద్బోధించారు. హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో సోమవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారుల 2022 డైరీ, క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మండల పరిషత్ అధికారుల, ఇతర అధికారుల, ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించారని అన్నారు. అర్హులైన అందరికీ ప్రమోషన్లు ఇచ్చారని ఆయన తెలిపారు. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని ఆయన అన్నారు.

రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధికి గత మూడేళ్ల కాలంలో 7 వేల 203 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు నేరుగా విడుదల చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. అలాగే, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా మరో 8 వేల 867 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో చేపట్టి అమలు చేశామని ఆయన తెలిపారు. పల్లె ప్రగ్రతి కార్యక్రమం క్రింద గ్రామీణ ప్రాంతాలలో అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్ లు, ఇతర కార్యక్రమాల వల్ల గ్రామాల రూపు రేఖలు మారాయని మంత్ర ఎర్రబెల్లి అన్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా అమలు కావడానికి మండల పరిషత్ అధికారులు అందరూ రెగ్యులర్ గా గ్రామాలను సందర్శించి ఈ కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఆయన కోరారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు గణనీయమైన కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించరాని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న వివిధ పథకాల విజయవంతం కావడానికి అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని మంత్రి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement