స్వాతంత్ర్య, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివదేహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. ఆమె పార్థివదేహం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. తమ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మల్లు స్వరాజ్యం, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం సర్కారును ఎదిరించారని అన్నారు. తూటా లా పేలే తన మాటను పాటగా మార్చి అనేక మంది ప్రజలను, ప్రత్యేకించి మహిళలను చైతన్య పరిచారని గుర్తు చేశారు. నాడు అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పని చేశారని, ప్రత్యేకించి పాలకుర్తిలో చాకలి ఐలమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తన సోదరుడు భీం రెడ్డి నరసింహ రెడ్డి వంటి ఉద్ధండులతో కలిసి పని చేశారని తెలిపారు.
ఆమె నడయాడిన నేల పాలకుర్తి ప్రాంతం ఇప్పటికీ చైతన్యం గల ప్రాంతం అని పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం బతికి ఉన్నన్ని రోజులు పాలకుర్తికి పలు సందర్భాల్లో వస్తూ ఉండేవారని తెలిపారు. వారికి, పాలకుర్తి ప్రాంతానికి విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. ఆమె జీవితం మహిళా లోకానికి, ఉద్యమాలకు ఆదర్శం. తెలంగాణ ఉద్యమానికి అమే స్ఫూర్తి అని అన్నారు. మల్లు స్వరాజ్యం జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించటానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
కాగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య తదితరులు ఉన్నారు. మల్లు స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సీపీఎం కార్యాలయం మాకినేని బసవ పున్నయ్య భవనంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు.