Friday, November 22, 2024

మినీ మేడారం జాత‌ర‌.. తేదీల‌ను ప్ర‌క‌టించిన గుడి పూజారుల సంఘం

మినీ మేడారం జాత‌ర నిర్వ‌హించబోయే డేట్ ల‌ను స‌మ్మ‌క్క‌..సార‌ల‌మ్మ గుడి పూజారుల సంఘం ప్ర‌క‌టించింది. మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మినీ మేడారం జాతరకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 4 వరకు మినీ జాతర నిర్వహించాలని నిర్ణయించినట్లు పూజారులు తెలిపారు. తొలిరోజు మండమెలిగే పండుగ, 2న సారలమ్మ అమ్మవారి గ‌ద్దె, 3న సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క, సారలమ్మల గద్దెలను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకోవచ్చని తెలిపారు.

కాగా, మినీ జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని అధికారులు వివరించారు.రెండేళ్లకు ఓసారి జరిగే మేడారం మహా జాతరకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మహా జాతరకు మధ్యలో మినీ మేడారం జాతర జరుగుతుంది. ఈ ఏడాది మహా మేడారం జాతర జరగగా.. వచ్చే సంవత్సరం మినీ మేడారం జాతర జరగనుంది. ఈ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం జరగదు.. గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement