ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి: రోజురోజుకు పాలకు డిమాండ్ పెరుగుతోంది.. కానీ దానికి తగ్గట్టు పాల ఉత్పత్తి పెరగడం లేదని జడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి పేర్కొన్నారు. పాల ఉత్పత్తి పెరిగేలా.. రైతులకు మరింత ప్రోత్సాహం కల్పించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బుధవారం జడ్పీలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ శాఖ కమిటీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ గణేష్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశానికి చైర్‌పర్సన్ అనితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో రోజూ 3 లక్షల లీటర్ల పాలు అవసరం కాగా, కేవలం 2 లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. లక్ష లీటర్ల కొరతను తీర్చేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. డెయిరీ రైతులకు సరైన ప్రోత్సాహం అందిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుందని అధికారులకు సూచించారు.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేది లేదని తేల్చి చెప్పినందునా యాసంగిలో తక్కువ వరి సాగు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారని.. ఇతర పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అనితారెడ్డి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కూరగాయలకు డిమాండ్ పెరుగుతోందని ఎక్కువమంది రైతులు కూరగాయలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్నందునా కూరగాయల సాగుతో మంచి లాభాలు వస్తాయని, ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. బిందు సేద్యంతో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని… వసతి గృహంతోపాటు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.