హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రతియేటా ఎండాకాలంలో జరుగుతున్న తంతే ఇది. నిత్యం పాల వినియోగానికి, ఉత్పత్తికి మధ్య భారీ తేడా రావడం సహజమే. కానీ ఇదే అదునుగా కొంతమంది పాల వ్యాపా రులు పాలను విషతుల్యం చేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం వారికి మరింతగా కలిసి వస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏవి కల్తీవో.. ఏవి అసలైనవో.. ల్యాబ్‌లో పరీక్షిస్తే తప్ప తెలుసుకోనంతగా కల్తీ పాలను తయారు చేస్తూ అక్రమార్కులు కోట్లల్లో వ్యాపారం సాగిస్తున్నారుఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర సామాగ్రిని వినియోగిస్తూ తయారు చేస్తున్న కృత్రిమ పాల వ్యాపారంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒకవైపు ఎక్కువ పాలు వచ్చేలా డెయిరీఫాంలలో పాడి గేదెలకు, ఆవులకు హానికర మైన ఇంజక్షన్లు ఇస్తూ స్వచ్చమైన పాలను విషవలయం చేస్తున్నారు. మరోవైపు వ్యాపారులు రహస్య ప్రదేశాలలో హానికరమైన రసాయన పదార్థాలను కలుపుతూ తయారు చేసిన పాలను మార్కెట్లోకి యదేచ్చగా వదులుతున్నారు.
నిత్యం మన రాష్ట్రంలో ప్రతిరోజూ సరాసరిగా 56.52 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ వినియోగం మాత్రం దాదాపు రెండింతలుగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం మనవద్ద నిత్యం పాల వినియోగం మాత్రం 92.32 లక్షల లీటర్లుగా ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలతో పాటు పొరుగు రాష్ట్రం కర్ణాటక నందిని మిల్క్, గుజరాత్ నుంచి అమూల్ బ్రాండ్‌తో వచ్చే పాలతో కొంత లోటు తీరుస్తున్నారు వ్యాపారులు. ఉత్పత్తి, వినియోగం మధ్య తేడాలను పరిశీలిస్తే, సుమారుగా 35.80 లక్షల లీటర్ల రాష్ట్రంలో పాల కొరత కనిపిస్తోంది. అనధికారిక లెక్కల ప్రకారం ప్రతిరోజూ సరాసరిగా 10 లక్షల లీటర్ల అమూల్ బ్రాండ్ పాలు రాష్ట్రవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. అలాగే మరో 6.50 లక్షల లీటర్ల నందిని బ్రాండెడ్ మిల్క్ విక్రయం జరుగుతోంది. ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే లోటు 19.30 లక్షల లీటర్లుగా కనిపిస్తోంది. ఈ కొరతను తీర్చేందుకు అక్రమార్కులు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే పాల కల్తీ ఎక్కువగా జరుగుతోంది. అప్పుడప్పుడు ప్రత్యేక రోజుల్లో డిమాండ్ మరింతగా పెరిగిపోతుండడం సహజమే. ఈ వ్యత్యాసాన్ని అదునుగా చేసుకుంటున్న వ్యాపారులు అక్రమ, కృత్రిమ మార్గంలో పాలను తయారు చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. కల్తీలో ఆరితేరిన కొందరు పాల వ్యాపారులు, డైరీ ఫాం యజమానులతో కుమ్మక్కై యథేచ్ఛగా మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పాల ఉత్పత్తి పెరిగేందుకు ప్రమాదకర పాలసేపు ఇంజెక్షన్లు వాడుతూ వినియోగదారుల్లో కల్తీపై ఆందోళన పెంచేస్తున్నారు. నిపుణులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ ఇంజెక్షన్ల వినియోగంతో పాల సేపుతో పాటు- పాల దిగుబడి పెరుగుతుంది. పాల శాతం ఎంత పెరుగుతుందో దానికంటే రెట్టింపు ప్రమాదం కూడా పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో పాడి పశువులకూ ప్రమాదం ఉందని రైతులకు పశువైద్యులు సూచిస్తున్నారు. పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పశుసంవర్ధక శాఖాధికారులతో పాటు- ఆహార తనిఖీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.