మంగపేట, (ప్రభన్యూస్) : మారుమూల అటవీ , గిరిజన గ్రామంలో ఓ గిరిజన మహిళకు ప్రసవ సమయం కావడంతో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో 108 అంబులెన్స్ ( వాహన సిబ్బంది) కి సమాచారం అందించగా 108 వాహన సిబ్బంది సకాలంలో స్పందిచడంతో 108 వాహనంలోనే ఆ మహిళ మహాలక్ష్మిలాంటి ఆడపిల్లను కనడంతో ఆ గిరిజన కుటుంబం కళ్ళలో కాంతులు మెరిశాయి. ఇందుకు సంబందించి 108 వాహన సిబ్బంది తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలంలోని దోమెడ సబ్ సెంటర్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గిరిజన గర్భిణీ స్త్రీ చీమల బాలమ్మ కి ప్రసవ సమయం రావడంతో గురువారం రాత్రి 2.30 గంటల సమయంలో ( తెల్లవారితే శుక్రవారం ) పురిటినొప్పులు రావడంతో స్థానిక 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన తిమ్మాపూర్ కు చేరుకుని గర్భిణీ స్త్రీకి ప్రథమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగపేట సామాజిక ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో గర్భిణీ స్త్రీ కి పురుటినొప్పులు అధికంగా అయ్యాయి. దీంతో 108 వాహన పైలట్ సహాయంతో అంబులెన్స్ ని రోడ్డు పక్కకు నిలిపివేసి ఈఆర్ సీపీ సూచన, సలహాల మేరకు 108 వాహనంలోనే సుఖ ప్రవసం చేయించి, పండంటి ఆడబిడ్డకు పురుడుపోసి ఆ తల్లి కళ్ళలో ఆనందాన్ని నింపారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అనంతరం ఈ విషయాన్ని వైద్యులకు తెలిపి మంగపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సుఖప్రవసం చేసి పురుడుపోసిన 108 వాహన ఈఎంటి చిరంజీవి, పైలట్ వేణుగోపాల్, స్థానిక ఆశా కార్యకర్త తదితరులను గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,