సూర్యాపేట, ప్రభన్యూస్: రెండు బైక్ లు ఢీకొని ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. కాగా, తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తిని హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ ఇవ్వాల ఉదయం ఆ యువకుడు కూడా చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని నశింపేట సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో బానోతు అరవింద్ (తెట్టేకుంట తండా), బుక్య నవీన్(బోత్యా తండా), దరవత్ ఆనంద్ (లక్ష్మీ నాయక్ తండా) ప్రమాద స్థలంలో చనిపోయారు.
ఏపూరుతండా కు చెందిన వినేశ్ కు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ వినేశ్ కూడా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతులంతా 22 ఏళ్ల లోపు యువకులే. చేతికంద వచ్చిన కుమారులు మృతి చెందడంతో బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.